‘పెద్ది’ కథకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరో చెప్పేసిన బుచ్చిబాబు

  • తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుడే సినిమాకు స్ఫూర్తి
  • అతడికి క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌లో మంచి ప్రతిభ
  • అతడిలో సినిమా క్యారెక్టర్‌ కనిపించేదన్న బుచ్చిబాబు
నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు రావడం కొత్తేమీ కాదు. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా వెనుక ఉన్న అసలు కథను దర్శకుడు బుచ్చిబాబు సనా తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు తన ఊర్లోని ఓ యువకుడే స్ఫూర్తి అని చెప్పారు.

తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుడిని ఆధారంగా చేసుకుని ఈ పాత్రను డిజైన్ చేసినట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ఆ యువకుడు రోజువారీ కూలీగా పని చేసేవాడని, అతనికి క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆటల్లో మంచి ప్రతిభ ఉండేదని తెలిపారు. స్థానికులు అతనికి డబ్బులు ఇచ్చి మరీ తమవైపు ఆడించుకునేవారని వివరించారు.

అతన్ని చూసినప్పుడల్లా మంచి సినిమా క్యారెక్టర్ కనిపిస్తుండేదని బుచ్చిబాబు తెలిపారు. ఆ ఆలోచనే ‘పెద్ది’ సినిమాకు పునాదిగా మారిందని చెప్పారు. దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఓ గుడిలో, హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డుపై కూర్చుని ఈ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు వివరించారు. రామ్ చరణ్ ఎలాంటి మార్పులు చెప్పకుండా ఈ కథను ఒప్పుకోవాలని దేవుణ్ని ప్రార్థించినట్లు చెప్పారు. అలాగే జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే యువకుడిగా కనిపిస్తారని బుచ్చిబాబు వెల్లడించారు. చరణ్ నటనపై పూర్తి నమ్మకంతో ఉన్నానని, భవిష్యత్తులో ఇంత శక్తిమంతమైన పాత్రను తాను రాయలేనని అన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Buchi Babu
Peddi Movie
Ram Charan
Buchi Babu Sana
Sukumar
AR Rahman
Peddiraju
Telugu Cinema
Movie Inspiration
Real Life Story

More Telugu News